Will BJP change India's name to Bharat? Amitabh Bachchan also tweeted.
Amitabh Bachchan: ఇండియా(India) పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోడీ(Modi) సర్కార్ దీనికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు జీ20 సదస్సు (G20 Summit) నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ పంపిన డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (President of Bharat) గా వ్యవహరించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఎక్స్ యాప్ వేదికగా బట్టబయలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు భారత్ అనే పదాన్ని అందరికి అలవాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమావేశంలో ఇండియా పేరును భారత్‌గా మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ (Bollywood) సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. భారత్ మాతా కీ జై అని రాస్తూ త్రివర్ణ పతాక ఎమోజీతో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న ప్రతిపాదనను అసోం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) స్వాగతించారు. అలాగే భారత్ పేరును కాంగ్రెస్ పార్టీ అనవసరంగా వివాదాస్పదం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర పేరుతో మీరు రాజకీయ పాదయాత్రలు చేయొచ్చని, భారత్ మాతకి జై అంటే మాత్రం వీరికి పడదని ఎద్దేవ చేశారు. దీనికి కారణం 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ఇటీవల I.N.D.I.Aగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో I.N.D.I.A పేరును ముందుకు తెచ్చింది. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు దేశం పేరును భారత్ గా మార్చాలని బీజేపీ యోచిస్తున్నట్టు.. ఇందులో భాగంగానే జీ20 సదస్సు ఇన్విటేషన్ లో భారత్ పేరును చేర్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.