తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బెంగాలీ నటి నుస్రత్ జహాన్(Nusrat Jahan)కు ఈడీ సమన్లు జారీ చేసింది.సెప్టెంబర్ 12న కోల్‌కతాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసు ముందు హాజరుకావాలని ఇవాళ ఆదేశించింది. గతంలో కేవలం రూ.6 లక్షలకే త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. అయితే ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసుల(Police)ను ఆశ్రయించారు. దీంతో ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఇది వరకే కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నాయకుడు శంకు దేబ్ పాండా (Shanku Deb Panda) ఫిర్యాదు చేయడంతో ఈడీ ఆమెపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ దాదాపు రూ. 24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై గతంలో కోర్టు (Court) లో కేసు దాఖలైంది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు వెల్లడించారు. దీంతో చివరికీ ఈడీని ఆశ్రయించామని తెలిపారు. అయితే ఈ విషయంలో జహాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. నుస్రత్ జహాన్ బెంగాలీ సినిమా (Bengali movie) ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున బసిర్హాట్ (Basirhat) నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. కాగా.. గతంలో ఫిబ్రవరి 2012లో పార్క్ స్ట్రీట్‌లో ఆంగ్లో-ఇండియన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్(Khader Khan)కు ఆశ్రయం కల్పించినట్లు జహాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2015లో అత్యాచార బాధితురాలు మరణించింది. నిందితుడు ఖాదర్ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు.