భారత ప్రధాని నరేంద్ర మోదీ (PMMODI) ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా 6జీ సాంకేతికత గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే మొబైల్ డేటా ప్లాన్లను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 5జీ సాంకేతికత (5G Technology) అందుబాటులో ఉందన్నారు.. త్వరలోనే 6జీ సాంకేతికతను (6G Technology) ప్రజలకు పరిచయం చేసేందుకు భారత్ (INDIA) వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 6జీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో 6జీ గురించి మరోసారి చర్చ మొదలైంది.
ఇంతకీ 6జీ నెట్వర్క్ (6G Network) అంటే ఏంటి? 5జీ కంటే ఇది ఎంత మెరుగ్గా ఉంటుందో చూద్దాం. 5జీ నెట్‌వర్క్‌కు అడ్వాన్స్డ్ వెర్షనే 6జీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు 700 జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం 5జీ సేవలు విస్తరించనున్నట్లు టెలికాం నెట్వర్క్ (Telecom network) సంస్థలు చెబుతున్నాయి. ఇక 6జీ నెట్వర్క్ 5జీ కంటే వెయ్యి రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం విభాగం (DoT) విడుదల చేసిన 6జీ డాక్యుమెంట్ ప్రకారం.. 5జీ నెట్వర్క్ సెకనుకు 10 గిగాబైట్స్ వేగంతో పనిచేస్తే.. 6జీ సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరంగా 5జీ ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్ నుంచి 66 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వేవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6జీలో మాత్రం స్పెక్ట్రమ్ వేవ్‌లు 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటి టెరాహెడ్జ్(Terahedge)ల వరకు ఉపయోగించవచ్చు.