PM Modi : పెరుగుతున్న ఎండలు.. అధికారులతో మోదీ హైలెవెల్ మీటింగ్
ఎండలు దారుణంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఎండల కారణంగా తలెత్తే సమస్యలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
PM Modi Meeting On Heat Wave : అధికమవుతున్న ఎండల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ఉన్నత స్థాయి అధికారులంతా చర్చించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగాలు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.
కేంద్ర ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, భారత వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రధానికి వివరించారు.
ఎండలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులు సన్నద్ధం కావాలని కేంద్రం సూచించింది. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్లు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్లు, తాగు నీరు లాంటి వాటిపై దృష్టి సారించాలని సూచించింది. టీవీలు, రేడియోలు సహా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అవసరమైన సమాచారం అందించి ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎన్డీఎంఏలు జారీ చేసిన సలహాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు అధికారులు చెప్పారు. అలాగే కార్చిచ్చు వంటి విపత్తుల నిర్వహణపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.