అవినీతి, వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి, శాంతిభద్రతలు తదితర సమస్యల నుండి భారత్ ను విముక్తం చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు (BJP was committed to taking tough measures to rid India of corruption, nepotism, and law and order issues). గురువారం బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం (BJP’s 44th Foundation Day) సందర్భంగా ఆయన (PM Narendra Modi) మాట్లాడారు. పవిత్రమైన హనుమాన్ జన్మోత్సవ్ (hanuman janmothsav) రోజున ఈసారి బీజేపీ ఆవిర్భావం దినోత్సవం వచ్చిందన్నారు. హనుమాన్, బీజేపీ మధ్య పోలికలు ఉన్నాయని, నిస్వార్థ సేవకు మారు రూపమన్నారు. హనుమంతుడు ఇతరుల కోసం ఏమైనా చేస్తాడని, కానీ తన కోసం తాను ఏమీ చేసుకోలేదన్నారు. బీజేపీ ఆయనను ఆదర్శంగా తీసుకొని, ముందుకు సాగుతోందన్నారు. అందరికీ ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బజరంగ్ బలిలా భారత్ తమ గొప్ప శక్తులను గుర్తిస్తోందని, సముద్రం వంటి పెద్ద సవాళ్లను భారత్ బలంగా ఎదుర్కొనే శక్తికి చేరుకున్నదన్నారు. ఈ సందర్భంగా తనను నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.
అవినీతి, బంధుప్రీతి వంటి సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. తమ అస్థిత్వం కోసం పోరాడుతున్న కొన్ని పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే ఉంటాయన్నారు. ప్రతిపక్షాలు విశాల దృక్పథంతో ఆలోచించలేకపోతున్నాయని, వారిది సంకుచిత మనస్తత్వమన్నారు. చిన్న లక్ష్యాలను పెట్టుకొని, వాటితో సంతృప్తి చెందుతున్నారన్నారు. బీజేపీ పెద్ద కలలను కనడంతో పాటు వాటిని నెరవేర్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదలు, అణగారిన వర్గాల కోసం పని చేస్తున్నామన్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకే వారిలో నిరాశ ఉందని, దీంతో తనకు సమాధి కడతానని (Baadshahi Mindset) బహిరంగంగానే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్ధాంతమే దేశం ఫస్ట్ అన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్ (everyone’s support, everyone’s development, everyone’s faith and everyone’s effort) నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎవరేమన్నా అవినీతిపై యుద్ధం ఆపేది లేదన్నారు.