Karnataka: కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఓట్లు రాబట్టుకునేందుకు సాధ్యం కాని హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 7.7 లక్షలు ఆటోలు ఉన్నాయి. వీటిలో ఆరు లక్షల ఆటోలు యాక్టివ్గా ఉన్నాయి. ఒక్కో ఆటోవాలా కుటుంబంలో నలుగురిని లెక్కలోకి తీసుకున్నా దాదాపు 25 లక్షల ఓట్ల వరకు ఉంటాయని అంచనా.
అంటే 25లక్షల ఓట్లు అంటే దాదాపు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ప్రభావం చేసి అవకాశం ఉంది. వీరు ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని తమవైపునకు తిప్పుకునేందుకు పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ప్రతి నెల రూ. 2 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తామని ప్రతిపక్ష జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అంతేకాదు పోలీసులు, రవాణాశాఖ అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కూడా ఆటోవాలాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో ఆటోవాలాలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఖాకీ చొక్కా ధరించి, స్వయంగా ఆటో నడిపి వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో తామేమీ తక్కువ కాదన్నట్టు అధికార బీజేపీ కూడా ముందుకొచ్చింది. తాము ప్రకటించిన బడ్జెట్లో ఆటోవాలాల పిల్లల కోసం ప్రకటించిన ‘రైతా విద్యానిధి’ పథకాన్ని గుర్తు చేస్తూ.. తమకు ఓటేయాలని కోరుతోంది.