ఆదిత్య ఎల్1 తర్వాత గగన్‌యాన్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. కానీ మరో ఐదేళ్లలో శుక్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్ర గ్రహంపైకి శుక్రయాన్ ప్రాజెక్ట్, అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టేందుకు మరో ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్3 (Chandrayan3) ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో (Isro) మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్1 (Aditya L1) ప్రయోగాన్ని చేపట్టింది. ప్రస్తుతం లాగ్రాంజ్ పాయింట్ వైపు ఆదిత్య ఎల్1 సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లి పరిశోధనలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ప్రయోగాలపై ఇస్రో దృష్టి పెట్టింది. శుక్రుడు, అంగారక గ్రహాలపై భారత్ కన్నేసింది.
వచ్చే ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్ట్ (Gaganyan Project) లాంచ్ చేయనుంది. అందులో భాగంగా ఈ మధ్యనే టెస్ట్ ఫ్లైట్‌ను కూడా విజయవంతం చేసింది. తదుపరి శుక్రుడు, అంగారక గ్రహాలపై ప్రయోగాలు చేపట్టేందుకు శాస్త్రవేత్తలు (Isro scientists) దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ ప్రయోగాలకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ ప్రయోగాలు ఎప్పుడు చేపడుతారనే దానిపై ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శంకరన్ (M.Shankaran) ఈ ప్రయోగాలపై కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో అంగారకుడు, శుక్ర గ్రహాలపై ఉనికిని గుర్తించేందుకు ఇస్రో ప్రయోగాలను చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇస్రోలో అంతర్గత చర్చలు సాగుతున్నాయని, పలు అధ్యయనాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. గత 2 ఏళ్లుగా అంగారక గ్రహంపై సేఫ్ ల్యాండింగ్ కోసం మిషన్ కాన్ఫిగరేషన్లను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
చంద్రయాన్ 3 (Chandrayan3) ప్రాజెక్ట్ విజయవంతం అయినట్లుగా శుక్రయాన్ ప్రాజెక్ట్ (Shukrayaan Project) కూడా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. భూమి, సూర్యుడి సాపేక్ష స్థితిని బట్టి అంగారకుడు, శుక్రుడు ప్రయోగాలను ఏ రోజైనా ప్రారంభించే అవకాశం ఉందని, అది రాబోవు 4, 5 ఏళ్లలోపే సాధ్యం అవుతుందని డైరెక్టర్ ఎం.శంకరన్ వెల్లడించారు.