పాకిస్తాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వరదలతో ఆహార ఉత్పత్తి తగ్గడం, విదేశీ నిల్వలు లేక దిగుమతులు ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. పరిస్థితి ఏ స్థాయికి చేరుకున్నదంటే గోధుమపిండి కోసం కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (PTI) అధికార షెహబాజ్ షరీఫ్ పైన విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, గతంలో ప్రధాని మోడీ వీడియోను షేర్ చేసి, పాక్ ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే ఇది ఇమ్రాన్ ఖాన్ పార్టీకి రివర్స్ అయింది.
2019 భారత లోకసభ ఎన్నికల సమయంలో రాజస్థాన్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోడీ ప్రసంగించిన వీడియో అది. పాక్ అహంకారాన్ని మేం దెబ్బకొట్టామని, వారు ప్రపంచమంతా తిరిగి బిచ్చమెత్తే స్థితికి తీసుకు వచ్చామని మోడీ మాట్లాడిన వీడియో అది. అణు దాడి చేస్తామని పాక్ బెదిరిస్తోందని, కానీ మేం భయపడటం మానేశామని, వారి వద్ద అణ్వాయుధాలు ఉంటే మన వద్ద ఉన్న ఆయుధాలు దీపావళికి దాచుకున్నట్లు కాదని నాలుగేళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.
ఈ వీడియోను ఇమ్రాన్ ఖాన్ పార్టీ షేర్ చేస్తూ, షెహబాజ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇందుకు సిగ్గుపడాలని, వెంటనే దిగిపోవాలని మండిపడ్డారు. ఈ వీడియో ఇమ్రాన్ పార్టీకి రివర్స్ అవుతోంది. ఎందుకంటే 2019లో పాక్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలో ఉంది. మొత్తానికి మోడీ హెచ్చరికల వీడియో ప్రస్తుత ఆహార, ఆర్థిక సంక్షోభం సమయంలో పాక్లో వైరల్ అవుతోంది.