Monsoon 2024 : అక్కడక్కడా అరకొర వర్షాలు పడుతున్నప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వేడి మాత్రం తగ్గలేదు. ఫలితంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారందరికీ భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఐదు రోజుల్లో నైరుతీ రుతుపవనాలు మన దేశంలోని కేరళను(KERALA) తాకుతాయని ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈ సారి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అసాధారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ ఏడాది అధికంగా వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక సైతం ఉంటుందని ఐఎండీ(IMD) తెలిపింది. గత 150 ఏళ్లుగా రుతుపవనాలు సరిగ్గా మన దేశంలోకి ఎప్పుడు ప్రవేశించాయి అనే విషయాన్ని ఐఎండీ లెక్కలు తెలియజేస్తున్నాయి. అయితే ఏటా ఈ తేదీ మారుతూ ఉండటం గమనార్హం.
భారత్లో గత శతాబ్దంలో చూసుకున్నట్లయితే చాలా ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అలాగే 1972లో చాలా ఆలస్యంగా జూన్ 18న వచ్చాయి. ఇక గత నాలుగేళ్లలో చూసుకున్నట్లయితే 2020లో జూన్1న, 2021లో జూన్ మూడున, 2022లో మే 29న, 2023లో జూన్ 8న ప్రవేశించాయి. ఇక ఈ ఏడాది జూన్ 1 లేదా రెండో తారీఖుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐఎండీ(IMD) తెలిపింది.