ఛత్తీస్గఢ్ (Chhattisgarh) శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మళ్లీ నెగ్గాలన్నపట్టుదలతో ఉన్న కాంగ్రెస్ (Congress) వ్యూహాలకు పదును పెడుతోంది. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(CM Bhupesh Baghel)కు ఉన్న జనాదరణే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంచుకోట ఛత్తీస్గఢ్ తమ చేజారిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ (BJP) నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. భూపేశ్ బఘేల్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారంతా తమనే ఆదరిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఛత్తీస్ గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు చేపట్టిన చర్యల వల్ల గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా నక్సల్స్ హింసాత్మక ఘటనలు 52 శాతం మేర తగ్గాయన్నారు. నక్సల్స్ (Naxals) ప్రభావిత జగదల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు.ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. రాష్ట్రంలో నక్సల్ ముప్పు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పంపిన డబ్బును కాంగ్రెస్ ‘ఏటీఎం’ ద్వారా ఢిల్లీ(Delhi)కి మళ్లిస్తోందని ఆయన విమర్శించారు. ‘‘ఛత్తీస్గఢ్ ప్రజలు ఈసారి దీపావళిని మూడుసార్లు జరుపుకుంటారు. పండుగ రోజున ఒకసారి, డిసెంబర్ 3న రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. జనవరిలో రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యేటప్పుడు మూడోసారి దీపావళి వేడుకలు చేసుకుంటారు’’ అని అమిత్ షా తెలిపారు