Four Maoists Killed : మహారాష్ట్రలోని గడ్చిరోలి(Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరు నలుగురూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టులని భద్రతా అధికారులు ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ భూమిలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు.
చనిపోయిన నలుగురిలో ఇద్దరిని పట్టి ఇచ్చిన వారికి భారీ రివార్డు ఉంటుందని గతంలో పోలీసు శాఖ ప్రకటించిందని భద్రతా అధికారులు తెలిపారు. వీరిద్దరినీ పట్టిచ్చిన వారికి రూ.36 లక్షల రివార్డు ప్రకటన చేసినట్లు తెలిపారు. హతమైన వారిని కుడిమెట్ట వెంకటేశ్, కుర్సంగ్ రాజు, మగ్తూ, వర్గీస్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో వర్గీస్ మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ అని తెలిపారు. అలాగే మగ్తూ అనే వ్యక్తి చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ అని వెల్లడించారు. రాజు, వెంకటేశ్‌లు ప్లటూన్ మెంబర్లని తెలిపారు.
ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ మావోయిస్టులు(Maoists) పోలీసులకు ఎదురు పడ్డారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ అలజడి సృష్టించాలన్న ధ్యేయంతో భారీ ఆయుధాలతో ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించబోతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. సిబ్బందిని చూసిన వారు కాల్పులకు తెగబడ్డారని ప్రతిగా పోలీసులూ కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు.