Fire Accident : రాజస్థాన్లోని ఖైర్తాల్-తిజారా జిల్లాలోని భివాడి ప్రాంతంలో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు.. మరో 10 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని, అందులో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (తిజారా) శివరాజ్ సింగ్ తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చామని, అయితే అక్కడ పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారని, అర్థరాత్రి ఫ్యాక్టరీ నుంచి మరో మూడు మృతదేహాలను వెలికి తీశారని చెప్పారు.
ఫార్మాస్యూటికల్ తయారీ కంపెనీలో మంటలు
రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఘటనాస్థలం నుంచి రెండు మృతదేహాలను బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఖుష్ఖేడా పారిశ్రామిక ప్రాంతంలోని ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియరాలేదు. క్షతగాత్రులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు.
పొగ కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం
కంపెనీలో మంటలు చెలరేగడంతో పేలుళ్లు సంభవించాయని సంఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. కంపెనీలో ఎక్కడ చూసినా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విపరీతమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది రాత్రి సమయంలో కంపెనీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉదయం చూడగా నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
బార్మర్లో కూడా అగ్నిప్రమాదం
అంతకుముందు, ఆదివారం తెల్లవారుజామున బార్మర్ జిల్లాలోని స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. గోదాం నివాస ప్రాంతంలో ఉందని చెప్పారు. గోదాములో మంటలు చెలరేగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు పలు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఆయన తెలిపారు.