పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (Prakash Singh Badal)మంగళవారం రాత్రి కన్నుమూశారు. మొహాలీ (Mohali)లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 95. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన ఆదివారం ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. చికిత్స పొందుతూ ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందారు.
బాదల్ 1970-1971, 1977-1980, 1997-2002, 2007-2017 కాలంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. పంజాబ్ (Punjab)లో యంగెస్ట్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్. ఈయన గత ఏడాది జూన్ నెలలోను ఆసుపత్రి పాలయ్యారు. కరోనా తదనంతర పరీక్షల కోసం గత ఏడాది ఫిబ్రవరిలోను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పంజాబ్లో పోరాడిన రాజకీయ యోధుడు ప్రకాశ్ సింగ్ బాదల్. పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు ఆయనను అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం కింద అరెస్ట్ చేసి కర్నాల్ జైలుకు తరలించారు.