Farmers protest: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు బుధవారం నిరసన కార్యక్రమాలను పునఃప్రారంభించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఓ యుద్ధమే జరిగింది. పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరీలో హింస చెలరేగింది. ఈ హింసలో 21 ఏళ్ల యువ రైతు శుభా కరణ్ సింగ్ చనిపోయాడు. తలకు బుల్లెట్ గాయం కావడంతో అతడు మరణించాడు. పోలీసుల కాల్పుల వల్లే రైతు మృతి చెందాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే ఆందోళనకారుల రాళ్లదాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. రైతు సుభాకరన్ మృతి పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఛలో ఢిల్లీ పాదయాత్రను రైతులు రెండు రోజుల పాటు వాయిదా వేశారు. రేపు సాయంత్రం తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. దీంతో పలువురు రైతులు గాయపడ్డారని, పలువురు గల్లంతైనట్లు సమాచారం. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజులు చలో ఢిల్లీ పాదయాత్రను నిలిపివేయాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోతుందన్నారు. రైతులు రోడ్డెక్కలేదని, ప్రభుత్వమే ఆ పని చేసిందన్నారు. శాంతియుతంగా ముందుకు సాగుతామని చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.
ఇటీవల పంటకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతు కూలీలకు పింఛన్, వ్యవసాయ రుణాల మాఫీ తదితరాలు రైతుల ప్రధాన డిమాండ్లు. అయితే కేంద్రం మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం అన్నారు. ఎంఎస్పి తదితర అంశాలపై ఐదో విడత చర్చలకు రైతులను ఆయన ఆహ్వానించారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లపై చర్చిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని చెప్పారు.