Farmers Protest: ఢిల్లీలో రైతుల ర్యాలీ.. నెల రోజుల పాటు 144 సెక్షన్
దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడానికి ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా భారీగా రైతు సోదరులు ట్రాక్టర్లతో తరలి వెళుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్ని విధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
farmers protest in delhi : తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ట్రాక్టర్లతో రాజధానిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో మోహరించారు. ఉదయం నుంచే బారికేడ్లు పెట్టి ట్రాక్టర్లను నగరంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. 144 సెక్షన్ మంగళవారం నుంచి నెల రోజుల పాటు రాజధానిలో అమలవుతుందని ప్రకటించారు. సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని ప్రకటించారు. వచ్చే నెల 12 వ తారీఖు వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. జనం ఎక్కడా గుంపులుగా తిరగడానికి వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రైతులు తలపెట్టిన ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి అనుమతి లేదన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు దేశ రాజధానిలో ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పుడు 3 వ్యవసాయ బిల్లులు సవరణను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తమ మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని, మరికొన్ని బిల్లల్లోనూ సవరణలు కావాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ కోరుతూ రైతులు ఆందోళనకు(farmers protest) సిద్ధమయ్యారు. చలో ఢిల్లీ, ఢిల్లీ చలో(Delhi Chalo), చలో పార్లమెంట్ లాంటి పేర్లతో ఆ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు ఎక్కి రైతులు రాజధానికి చేరుకుంటున్నారు.
ఇలా తరలి వస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగిస్తున్నారు. రోడ్లు దిగ్బంధించడం, ప్రజా జీవనానికి అడ్డం కలిగించడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే స్థానిక ప్రజలను జాగ్రత్తగా తమ కార్యాలయాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. మరో పక్క రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, అర్జున్ ముండాలు సోమవారం నుంచే చర్చలు ప్రారంభించారు.