అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు.
ప్రస్తుతం నేతలు మాటలకే పరిమితం అవుతున్నారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలి. ఇప్పటికీ సాగునీటికి కష్టాలే.. తాగునీరు, కరెంట్ కు కష్టాలే. దేశానికి అన్నం పెట్టే అన్నదాత రాత్రింబవళ్లు కష్టపడి చెమటోడ్చి ఈ దేశానికి అన్నం పెడుతున్నాడు. అలాంటి రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయి. మనం ఆలోచించాలి. అందుకే.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రైతుల గురించి మాట్లాడలేదు.. ఎప్పుడూ చెప్పలేదు.. కానీ నాందేడ్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది.. ఇప్పటి నుంచి రైతుల ప్రభుత్వం రాబోతోంది.. అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.
మరఠ్వాడ గడ్డ ఎందరో మహనీయులకు జన్మనిచ్చింది
మరఠ్వాడ గడ్డ ఎందరో మహనీయులకు జన్మనిచ్చిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరాఠా యోధులకు నివాళులు అర్పించి, శివాజీ, అంబేద్కర్, పూలే విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాల వేసి సభను ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. నాందేడ్ సభకు హాజరు కావడానికి ముందు సీఎం కేసీఆర్ గురుద్వారలో ప్రత్యేక పూజలు చేశారు. సభ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ పార్టీలో పలువురు మహారాష్ట్రకు చెందిన నేతలు చేరారు.