»Change Indias Name To Bharat What Amendments Should Be Made In The Constitution And Supreme Court
Bharat: ఇండియా పేరును మార్చొచ్చా.. రాజ్యంగం, సుప్రీం కోర్టు ఏం చెబుతోంది.
ఇండియా ను భారత్‌గా కేంద్రం పేరు మార్చబోతున్న ప్రచారం జరుగుతుంది. అయితే అలా మార్చడానికి వీలు ఉందా... ఈ విషయంలో రాజ్యంగ ఏం చెబుతోంది. సుప్రీం కోర్టు ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Change India's name to Bharat, what amendments should be made in the Constitution and Supreme Court?
Bharat: ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20(Z20 Summit) సదస్సు జరగనున్న సమయంలో ఇండియా(India) పేరును భారత్(Bharath) గా కేంద్రం మార్చబోతుంది అన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయంశం అయింది. సదస్సుకు హాజరయ్యే అతిథులకు, ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏర్పాటు చేసే విందుకు ఆహ్వానం పత్రంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు(President Of India) బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (President of Bharat) అని రాసి ఉండటం దీనకి కారణం. ఈ మేరకుకాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్‌తో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ప్రముఖులు స్పందించడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అసలు ఏ పేరు అధికారికం? రాజ్యాంగంలో (Constitution of India) ఏం చెబుతోంది? ఈ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) గతంలో ఏం చెప్పింది? అనేది ఒక సారి సమీక్షిద్దాం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఇండియా, ఇది భారత్ రాష్ట్రాల సమాఖ్య అని స్పష్టంగా చెబుతోంది. దీని ప్రకారం మన దేశం పేరు ఇండియా, భారత్ ఈ రెండూ అధికారిక పేర్లే. తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మాత్రమే పేర్కొనడంతో.. ఇండియా పేరును భారత్ గా మార్చనున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఇండియా (India) పేరు మార్పు ప్రస్తావన గతంలో లోక్‌సభలో వచ్చింది. ఈ పేరును మార్చాలంటూ గతంలో సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు వేశారు. కాని వాటిని అపెక్స్ కోర్టు తోసిపుచ్చింది.
సుప్రీం కోర్టు తీర్పులు
2020లో సుప్రీంకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. ఇండియా అనే పదం వలసవాదులు ఇచ్చిందని.. అది బానిసత్వానికి చిహ్నంగా ఉందని పిటిషనర్ వాదించారు. అందుకే ఆర్టికల్ 1ను సవరించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించాలని కోరారు. సుప్రీం దాన్ని కూడా తోసిపుచ్చింది. గతంలో 2016లో కూడా ఇదే తరహా వాదనలను భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టిపరేసింది. రాజ్యాంగంలో ఇండియా, భారత్ రెండు పేర్లు ఉన్నాయని దేన్నైనా అధికారికంగా పేర్కొనొచ్చని అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు.
మార్చాలనుకుంటే ఏం చేయాలి
ఒకవేళ ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం ఆర్టికల్ 1లో సవరణ చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టాలి. అయితే సాధారణ మెజార్టీతో (మొత్తం సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువ) దీన్ని సవరించడం వీలుకాదు. ఆర్టికల్ 1ను సవరించాలంటే ప్రత్యేక మెజార్టీ (మూడింట రెండొంతుల మెజార్టీ)తో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో జరిగే అత్యవసర పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తుంది. దీనిపై విపక్ష పార్టీలు కేంద్రాన్ని విమర్షిస్తున్నారు.