»Chandrayaan 3 Getting Ready For Launch Isro Video Viral
Chandrayaan-3: ప్రయోగానికి సిద్ధం అవుతున్న చంద్రయాన్-3.. ఇస్రో వీడియో వైరల్..
చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఈ రోజు అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్లో రాకెట్‌కు చంద్రయాన్ క్యాప్సూల్‌ను ఫిక్స్ చేశారు.
Chandrayaan-3 getting ready for launch.. ISRO video viral..
చంద్రయాన్-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్రయోగించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రయోగం కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఈ రోజు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్(Satish Dhawan Centre) నుంచి ఆ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. సతీశ్ ధావన్ సెంటర్ వద్ద ఎల్వీఎం-3(LVM-3)తో చంద్రయాన్ క్యాప్సూల్‌ను జత చేసినట్లు ఇస్రో వీడియో రూపంలో తెలిపింది. దీంతో దాదాపు చంద్రయాన్-3 స్పేప్ క్రాఫ్ట్ ప్రయోగానికి సంబంధించిన పనులన్నీ ముగిశాయి.
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3900 కేజీల బరువు ఉంటుంది. మొదట యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పేలోడ్‌ను క్యాప్సూల్ తయారు చేశారు. అక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన వావానంలో సతీశ్ ధావన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ రాకెట్‌తో పేలోడ్‌ను అనుసంధానం చేశారు. అన్నీ అనుకూలిస్తే 13వ తేదీన, లేదంటే 19వ తేదీలోగా చంద్రయాన్3ని ప్రయోగించనున్నట్లు ఇటీవల ఇస్రో చైర్మెన్ సోమనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాకెట్ పైభాగంలో పేలోడ్ ఉంటుంది. దానిలో ల్యాండర్, రోవర్ ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రొపల్సన్ మాడ్యూల్ వల్ల చంద్రుడికి సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు స్పేస్‌క్రాఫ్ట్ వెళ్లడానికి వీలు ఉంటుంది. అలా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ముందుగానే నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్ సురక్షితంగా దిగుతుందని, ఆ తర్వాత రోవర్ అక్కడ రసాయనక విశ్లేషణ చేపడుతుందని ఇస్రో అధికారులు తెలిపారు. ఈ ప్రయోగానికి సర్వం సిద్ధం అవుతున్న వీడియోను ఇస్రో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.