First Woman Bsf Sniper : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Bsf)లో తొలి మహిళా స్నైపర్‌గా హిమాచల్ ప్రదేశ్ కి చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. అత్యంత కఠినంగా ఉండే ఈ స్నైపర్‌గా శిక్షణ పొందడానికి పురుషులు కూడా వెనకాడుతూ ఉంటారు. శత్రువులకు కనపడకుండా మాటు వేసి గురి తప్పకుండా కాల్పులు జరిపే వారిని స్నైపర్ అని పిలుస్తారు. అలాంటి కఠినతరమైన శిక్షణను పూర్తి చేసిన సుమన్ కుమారి తొలి మహిళా స్నైపర్‌గా నిలిచారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటంలో బీఎస్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. అక్కడ ఇలాంటి స్నైపర్ దాడుల ముప్పును గమనించిన సుమన్ కుమారి తాను కూడా ఈ శిక్షణలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీనిలో చేరాలనుకునే వారు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇందౌర్‌లోని ‘సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’లో ఆమె ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ‘ఇన్స్ట్రక్టర్’ గ్రేడ్ని పొందారు.
మొత్తం ఎనిమిది వారాల పాటు జరిగిన ఈ శిక్షణలో 56 మంది పాల్గొన్నారు. వారిలో ఉన్న ఒకే ఒక మహిళ సుమన్ కావడం విశేషం. ఆమె ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆమె తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేశారు. తొలి మహిళా స్నైపర్‌గా నిలిచిన తన విజయం పట్ల తామెంతో గర్వపడుతున్నామని తెలిపారు. తమ కుమార్తె ధైర్య సాహసాల గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటోందన్నారు.