»Another Derailed Train Tension Among Railway Passengers
Train Derail : పట్టాలు తప్పిన మరో రైలు.. రైల్వే ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
విజయనగరంలో రైలు ప్రమాద ఘటన జరిగి వారం రోజులు కూడా కాకుండానే యూపీలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సుహైల్ దేవ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ మధ్య వరుస రైలు ప్రమాద ఘటనలు (Train Accidents) చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్వే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ట్రైన్లో ప్రయాణించాలంటే కొందరు భయపడుతున్నారు. విజయనగరం రైలు ప్రమాద ఘటన జరిగి వారం రోజులు కూడా గడవక ముందే తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలో మరోసారి రైలు పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది.
యూపీలోని ప్రయాగరాజ్ రైల్వేస్టేషన్లో (Prayagraj Railway Station) రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు, ఇంజిన్ ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. మంగళవారం రాత్రి వేళ ఈ ఘటన జరిగింది. రైలు స్టేషన్ నుంచి బయల్దేరగానే ఒక్కసారిగా పట్టాలు తప్పిందని, ఈ ఘటనకు గల కారణాలను కనుక్కుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ మధ్య ఈ రైలు నడుస్తుంది. సుహైల్ దేవ్ ఎక్స్ప్రెస్ (Suhel Dev Express) పట్టాలు తప్పడంతో రైల్వే ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.
రెండు కోచ్లు, ఇంజిన్ పట్టాలు తప్పినట్లుగా ఉత్తర మధ్య రైల్వే (North Central Railway) ప్రకటించింది. ఇంజిన్ రెండు చక్రాలు ట్రాక్ నుంచి విడిపోయాయని, దీంతో ఇంజిన్ వెనక ఉన్న రెండు కోచ్లు పట్టాలు తప్పాయని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ఈ ప్రమాదం 6వ నంబర్ ఫ్లాట్ ఫాం నుంచి రైలు బయల్దేరిన తర్వాత జరిగిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.