ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా?
తానొకటి తలిస్తే, మరొకటి జరిగి ఇరుకున పడ్డారా?
ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మధ్య చిక్కుకుపోయారా?
మునుగోడు కోసం వేసిన స్కెచ్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ పెడుతోందా?
కోర్టులో వరుస షాక్‌లు ప్రభావం చూపిస్తాయా?
ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తొలిచివేస్తున్న అంశాలు.
మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఫామ్ హౌస్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు బీజేపీ కొనుగోలులో తమకు ప్రమేయం లేదంటూ కోర్టు మెట్లు ఎక్కగా, మరోవైపు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారంటూ ఫిర్యాదులు చేస్తోంది. మొత్తానికి ఉపఎన్నిక సమయంలో జరిగిన ఈ ఉదంతం.. సాగదీత చోటు చేసుకొని, కేసీఆర్ అడ్డంగా బుక్కయాయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు చేసిన పొరపాట్లు బీజేపీకి ఆయుధంగా మారాయి. అదే సమయంలో అధికార పార్టీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేరడంపై కాంగ్రెస్ పోరు సంకల్పించింది. తాజాగా, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను 2014 నుండి 2018, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నారని, ఎమ్మెల్సీలను కూడా తీసుకున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018లో బీఆర్ఎస్ నుండి 88 మంది గెలిస్తే, తమ పార్టీ నుండి గెలిచిన 12 మందిని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, తీసుకున్నారని, వారిపై ఫిర్యాదు చేశామని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారన్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టుకు వెళ్లిందని, పోలీసులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేసీఆర్‌కు ఇచ్చారని, ఆయన మీడియా ముందు పెట్టి, కోర్టుకు వీటిని పంపించారని, దీంతో న్యాయస్థానం కూడా విచారణ వివరాలను బయట పెట్టడాన్ని తప్పుబట్టిందన్నారు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని బీజేపీ కోర్టులో పిటిషన్ వేసిందని, కోర్టు తీర్పులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాయన్నారు. మొత్తానికి కేసీఆర్ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని ఆరోపణలు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం గమనార్హం. వారికి కాంట్రాక్టులు వంటివి చూపించి చేర్చుకున్నదన్నారు.
మరోవైపు, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీఆర్ఎస్ పొరపాట్లను బీజేపీ అస్త్రంగా వాడుకుంటూ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న అమిత్ షా ఈ అంశాన్ని పక్కా ప్లాన్‌తో ముందుకు తీసుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం వెనుక ఉండి నడిపిస్తున్నారట. కొనుగోలు ఆరోపణల సమయంలో డబ్బులు ఉన్నాయని చెప్పి, అవి లేకపోవడం, ఎమ్మెల్యేల తడబాటు, వారిని కేసీఆర్ ప్రగతి భవన్లో అట్టిపెట్టుకోవడం తెలిసిందే. వీటికి తోడు సిట్ విచారణ వివరాలను, వీడియోలను కేసీఆర్ మీడియా సమావేశంలో బహిర్గతం చేయడం కోర్టు తప్పుబట్టింది. విచారణ సంస్థల వద్ద ఉండాల్సిన వివరాలు కేసీఆర్ వద్దకు వెళ్లడం సరికాదని, సిట్ దర్యాఫ్తులో పారదర్శకత లేదని, అందుకే సిబిఐకి అప్పగిస్తున్నట్లు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. దీనిని బీఆర్ఎస్ సవాల్ చేస్తూ, పై కోర్టుకు వెళ్లింది.
కానీ బీజేపీ పక్కా వ్యూహంతో, అన్ని ఆధారాలతో కేసీఆర్‌ను కోర్టులో, బయటా అడ్డంగా బుక్ చేసే విధంగా ముందుకు సాగుతోంది. కేసీఆర్ విసిరిన అస్త్రాన్ని ఆయన పైకే తిప్పి కొడుతోంది. ఇందులో భాగంగా గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్ వివిధ పార్టీల నుండి చేర్చుకున్న ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పిస్తోంది. సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ నుండి చేరిన ఎమ్మెల్యేల జాబితాను ఇస్తోంది. 2014-18 మధ్య 25, 2018 తర్వాత 13 మంది మొత్తం 37 మంది బీఆర్ఎస్లో చేరారు. అలాగే, బీజేపీ 8 ప్రభుత్వాలను కూల్చివేసిందన్న ఆరోపణలకు కూడా ధీటుగా సమాధానం చెబుతోంది. ఇలా వివిధ అంశాలను, ఆధారాలను చూపించి, కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా సిట్‌ను, ప్రభుత్వ విభాగాలను ప్రభావితం చేశారని ఆరోపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ బీజేపీ పైకి విసిరిన కొనుగోలు అస్త్రం, ఆయనకే ఎదురు తిరిగిందని, బీజేపీ అగ్రనేత అమిత్ షా తన రాజకీయ వ్యూహం ముందు కేసీఆర్ వ్యూహాలు తిరగబడ్డాయని అంటున్నారు.