బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు బడా దర్శక, నిర్మాతలు. దాంతో గతంలో లాగా కాకుండా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆర్సీ15 ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు శంకర్. అలాగే ఆగిపోయిన ఇండియన్ 2ని కూడా ఇటీవలో తిరిగి పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న శంకర్.. ఆ తర్వాత హిందీలో అపరిచితుడు రీమేక్ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. శంకర్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో చేయబోతున్నాడు.. హీరో ఎవరు.. అనే విషయాల్లో గత కొద్ది రోజులుగా రకరకాల కథనాలు వినిపించాయి.
చరణ్ ప్రాజెక్ట్ తర్వాత తెలుగు హీరోతోనే శంకర్ మరోసారి సినిమా చేయబోతున్నాడని వినిపించింది. కానీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ రచయత ఎస్ వెంకటేష్ చారిత్రాత్మక నేపథ్యంలో రచించిన ఓ నవల అధారంగా ఈ సినిమా చేయబోతున్నాడట శంకర్. అది కూడా 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు పనులు కూడా మొదలైనట్టు టాక్. ప్రస్తుతం సూర్య దర్శకుడు బాలా కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే శివ దర్శకత్వంలో 42వ చిత్రం చేస్తున్నాడు. వెట్రిమారన్తోను ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలు అయిపోయిన తర్వాత సూర్య-శంకర్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ నిజంగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటే మాత్రం ఓ రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు.