Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కోసం రంగంలోకి 50 మంది లాయర్లు
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రేపు వంద శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్‌ను ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉంచారు. మరోవైపు బెయిల్ కోసం పల్లవి ప్రశాంత్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును వాయిదా వేసింది. కోర్టు విచారణ తర్వాత లాయర్లు మీడియాతో మాట్లాడారు.
సామాన్యుడి కోసం సామాన్య న్యాయవాదులుగా పోరాడామని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాదనలు వినిపించినట్లు తెలిపారు. ఒక రైతు బిడ్డ కష్టపడి చిన్న చిన్న వీడియోలు చేస్తూ పల్లెలో ఉంటూ సోషల్ మీడియాలో హీరో ఇమేజ్ సంపాదించుకుంటే, ఆ వ్యక్తి కళను గుర్తించి నాగార్జున బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చారని, అందరి సపోర్టుతో విజేత అయ్యాడని అన్నారు. అలాంటి వ్యక్తిని క్రైమ్ చేయకున్నా నేరం చేశాడని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేశారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేరం చేయని వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. జడ్జి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రేపు సానుకూలంగానే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది లాయర్లు పల్లవి ప్రశాంత్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రేపు ప్రశాంత్‌కు వంద శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.