»Us Man Breaks World Record By Going To 777 Movies In A Single Year
Guinness World Record: ఏడాదిలో 777 సినిమాలు చూసి వరల్డ్ రికార్డు
ఓ వ్యక్తి ఏడాదంతా సినిమాలు చూస్తూ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఒకే సంవత్సరంలో 777 సినిమాలు చూసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు.
ఓ వ్యక్తి ఏడాదిలో 777 సినిమాలు (Movies) చూసి వరల్డ్ రికార్డ్ (World Record) సాధించాడు. చాలా మంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 777 సినిమాలను చేసి ఆ ఘనత సాధించాడు. జాక్ స్వోప్ అనే వ్యక్తి ఈ రికార్డు నమోదు చేయడానికి 2022 జూలై నుంచి 2023 జూలై వరకూ 777 మూవీస్ చూశాడు.
అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా జాక్ స్వోప్ చరిత్ర సృష్టించారు. నియమాలను అనుసరించాడని నిర్ధారించుకున్నాకే ఆ వ్యక్తి పేరును నిర్వాహకులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. 2015లో ఆ రికార్డు ఫ్రాన్స్‌కి చెందిన విన్సెంట్ క్రోన్ పేరుపై ఉండేది. అప్పట్లో క్రోన్ 715 సినిమాలు చేసి రికార్డు లిఖించాడు. ఇప్పుడు 777 సినిమాలు చూసి జాక్ ఆ రికార్డును తిరగరాశాడు.
జాక్ స్వోప్‌కు 32 ఏళ్లు. సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాదీ 150 సినిమాల వరకూ చూసేవాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు జాక్ మొదటగా మిలియన్స్ : రైజ్ ఆఫ్ గ్రూ అనే సినిమాతో ప్రారంభించి ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమాతో ముగించాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడానికి ఆ వ్యక్తి సినిమా చూసే టైంలో ఇంకో పని చేయకూడదు.
సినిమా చూస్తూ ఫోన్ చూడటం, నిద్రపోవడం వంటివి చేయకూడదనే రూల్ ఉంది. అంతేకాకుండా సినిమా చూసే సమయంలో తినడం, తాగడం వంటివి అస్సలు చేయకూడదు. ఈ నిబంధనలను పాటించిన తర్వాతే గిన్నిస్ యాజమాన్యం జాక్ పేరును రికార్డుల్లోకి ఎక్కించింది. జాక్ ప్రతి రోజూ రెండు నుంచి మూడు సినిమాలు చూడటంతో ఈ రికార్డును నెలకొల్పగలిగాడు.