Emine Dzhaparova: ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు రానున్నారు. గతేడాది జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. ఝపరోవా భారత పర్యటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ప్రకటించింది. ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ ఝపరోవా ఏప్రిల్ 9 నుండి 12 వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉంటారని అందులో పేర్కొన్నారు.
ఝపరోవా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మతో చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రపంచ సమస్యలపై పరస్పరం చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆమె ఆహ్వానించవచ్చని భావిస్తున్నారు. ఝపరోవా విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు విక్రమ్ మిస్రీని కూడా కలవనున్నారు.
గత ఏడాది అక్టోబర్ 4న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడినారు. యుద్ధం విషయంలో ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉక్రెయిన్‌తో భారతదేశం స్నేహపూర్వక సంబంధాలు, సహకారాన్ని పంచుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.