boat sink :ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో(Mozambique) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీర సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోయింది. దీంతో 90 మందికిపైగా మరణించారు(90 killed). ప్రమాద సమయంలో పడవలో 130 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కలరా వస్తుందన్న భయంతో చాలా మంది ప్రజలు ఫిషింగ్ బోట్లో(fishing boat) నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
సామర్థ్యానికి మించి బోటులో జనం ఎక్కువగా ఎక్కడం వల్లనే ఈ ఘటన జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారని నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో వెల్లడించారు. స్థానికంగా కలరా వ్యాప్తిచెందుతుందంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇక్కడ గత అక్టోబర్ నుంచి దాదాపుగా 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. వీరిలో 32 మంది మరణించారు. ఎక్కువగా నంపులా ప్రావిన్స్ ప్రభావితమైంది. కలరా కేసుల్లో ఏకంగా మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఈ కారణంతోనే ప్రజలు దీవుల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది.