అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో ఆ దేశ రక్షణశాఖ చైనా బెలూన్ను కూల్చివేసింది. దక్షిణ కరోలినా తీరానికి సమీపంలో కూల్చివేయగా.. శిథిలాల కోసం అట్లాంటిక్ సముద్రంలో గాలింపు చర్యలను చేపట్టింది. తమ అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ నిఘా పెట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్జీనియాలో గల లాంగ్లే ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాప్ట్‌తో క్షిపణిని ప్రయోగించి బెలూన్ను నేలమట్టం చేసింది.
అమెరికా గగనతంలో చైనా బెలూన్ కలకలం రేపింది. విషయాన్ని రక్షణశాఖ అధ్యక్షుడు దృష్టికి తీసుకొచ్చింది. బెలూన్ కూల్చివేయాలని జో బైడెన్ స్పష్టంచేశారు. కరోలినా తీరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆ ప్రక్రియను చేపట్టారు. దీంతో ఎవరికీ హానీ జరగలేదని పెంటగాన్ పేర్కొంది. తమ ఆపరేషన్‌కు కెనడా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపింది.
చైనా బెలూన్ను పెంటగాన్ బుధవారం గుర్తించింది. వెంటనే అధ్యక్షుడు బైడెన్‌కు సమాచారం ఇచ్చింది. ఆ ‘బెలూన్ను కూల్చివేయమని చెప్పానని.. ప్రజలకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఆలస్యమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని శనివారం నేలమట్టం చేశారు’ అని బైడెన్ తెలిపారు. బెలూన్ కూల్చివేత అంశంపై చైనా గట్టిగానే స్పందించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది ఉల్లంఘనేనని తెలిపింది. దీనిపై అమెరికా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.