»Kathleen Falbig Acquitted After 20 Years In Prison
Kathleen Falbig: 20 ఏళ్లు జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా తీర్పు!
పేగు తెంచుకుని పుట్టిన కన్నపిల్లలను తల్లి హత్య చేసిందని ఆరోపణలతో క్యాథ్లీన్ ఫాల్బిగ్ అనే మహిళకు కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. తనని తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఆమెకు 20 ఏళ్లు పట్టింది.
Kathleen Falbig: తన పేగు తెంచుకుని పుట్టిన పిల్లల్ని ఏ తల్లి చంపుకోదు. కన్న పిల్లలను తానే చంపింది అనే ఆరోపణను కూడా ఏ తల్లి భరించలేదు. ఇలాంటి ఎన్నో ఆరోపణలతో 20 ఏళ్లు జైళ్లో మనోవేదన అనుభవించి నిర్దోషిగా బయటపడింది ఓ మహిళ. ఆస్ట్రేలియాకు చెందిన క్యాథ్లీన్ ఫాల్బిగ్ అనే మహిళకు నలుగురు పిల్లలు. 1989 నుంచి 1999 మధ్యలో ఈ నలుగురు పిల్లలు అనూహ్యంగా చనిపోయారు. ఎలాంటి కారణం లేకుండా మొదటి ముగ్గురు చిన్నారులు పుట్టిన ఏడాదిలోపు చనిపోయేవారు. సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ వల్ల చనిపోయారని డాక్టర్లు భావించారు. అయితే నాలుగో బిడ్డ పుట్టిన 18 నెలల తర్వాత చనిపోయింది.
ఎలాంటి కారణం లేకుండానే బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వీటిపై ఫోరెన్సిక్ రిపోర్టులు స్పష్టంగా లేవు. కానీ తల్లే పసిబిడ్డకు శ్వాస ఆడకుండా చంపేసిందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. తాను ఎలాంటి హత్య చేయలేదని చెప్పినా ఎవరు నమ్మలేదు. పిల్లలను హత్య చేసిన నేరం కింద 2003లో ఆమెను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆస్ట్రేలియా మొత్తం ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా పేరు పెట్టింది. పుట్టిన పిల్లలందరివీ సహజ మరణాలని చెబుతున్నా.. అందరూ తానే హత్య చేసిందని ఆరోపించారు. ఏ తప్పు చేయలేదని తనని తాను నిరూపించుకోవడానికి కాథ్లీన్ ఏళ్ల తరబడి పోరాడింది.
2019లో మళ్లీ ఈ కేసుపై విచారణ చేపట్టారు. కానీ అప్పుడు కూడా ఆమె నేరం చేసినట్లు కోర్టు వెల్లడించింది. తర్వాత మళ్లీ 2022లో విచారణ చేయగా.. కాథ్లీన్ నిర్దోషి అని తెలిపింది. తాను దోషి కాదు నిర్దోషి అని తప్పించుకోవడానికి ఆమెకు రెండు దశాబ్దాల సమయం పట్టింది. పిల్లలంతా సహజ కారణాలతో మృతి చెందారని కోర్టు తేల్చడంతో ఆమెకు జైలు నుంచి విముక్తి కల్పించారు. తన పిల్లల మృతిపై సైన్స్, జెనెటిక్స్ క్లారిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఎలాంటి తప్పు చేయకపోయిన ఇంతకాలం జైలు శిక్ష అనుభవించినందుకు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు.