Sailors : సముద్రపు దొంగల నుంచి పాకిస్థానీయుల్ని కాపాడిన భారత్
భారత నౌకాదళం సముద్రపు దొంగల భారి నుంచి పాకిస్థానీయుల్ని కాపాడింది. వారు పని చేస్తున్న ఓ ఇరానీ నౌకను కాపాడేందుకు12 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Navy Rescues Pak Sailors : సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత నౌకాదళం 12 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన చేపల బోటును వారు హైజాక్ చేశారు. ఈ ఘటన అరేబియా సముద్రంలో గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికన్ మైళ్ల దూరంలో జరిగింది. అక్కడ సముద్రపు దొంగలు ఈ ఇరానీ పడవను తమ అధీనంలోకి తీసుకున్నారు.
ఈ సమాచారం భారత నౌకాదళానికి(INDIAN NAVY) అందింది. దీంతో అప్రమత్తమైన మన నేవీ(NAVY) వారు ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తొలుత ఐఎన్ఎస్ సుమేధా బోట్‌తో సముద్రపు దొంగల అదుపులో ఉన్న బోటును అడ్డగించారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ నౌక ఆపరేషన్లోకి దిగింది. దాదాపు 12 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. అనంతరం బోటులో ఉన్న సముద్రపు దొంగలు లొంగిపోయారు.
దీంతో ఆ పడవను భారత్ నేవీ తన అధీనంలోకి తీసుకుంది. దీనిలో 23 మంది పాకిస్థానీ జాతీయులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయట పడినట్లు నేవీ ప్రకటించింది. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నట్లు నేవీ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా గల్ఫ్ ఏడెన్‌లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు అండగా నిలుస్తోంది.