sleeplessness : రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఈ లోపం కావొచ్చు!
మన శరీరంలో ఒక ఖనిజం లోపిస్తే మనకు నిద్ర పట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయట. మరి ఆ ఖనిజం ఏంటో, ఏ ఆహారాల తినడం ద్వారా ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం రండి.
Magnesium Deficiency : మనం ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి నిద్ర అనేది ఎంతో అవసరం. కనీసం ఏడెనిమిది గంటల పాటు నిద్ర ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొంత మంది పడక మీద వాలినా గంటల తరబడి నిద్ర పట్టదు. రోజుల తరబడి ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. నిద్రలేమితో నీరసంగా అయిపోయినట్లుగా ఉంటుంది. మిమ్మల్నీ ఈ సమస్య గనుక వేధిస్తుంటే అది మీలో మెగ్నీషియం లోపం వల్ల కావచ్చు.
నిద్ర పట్టకపోవడానికి(sleeplessness) అనేక కారణాలు ఉంటాయి. బ్లూ లైట్ ఎక్స్పోజర్, ఒత్తిడి, ఆందోళన, మెడికేషన్.. లాంటి వాటితో పాటు మెగ్నీషియం లోపమూ ఒక కారణమే. మరి దీన్ని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి సరిపడా మోతాదులో మెగ్నీషియం లభించాలంటే మినుములు, శనగలు, పెసరలు, కందుల్లాంటి పప్పులను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వీటి పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఇంకా పాలు, పెరుగు, డైరీ ఉత్పత్తుల్లోనూ ఇది సమృద్ధిగా లభిస్తుంది.
ఆకు కూరలు, బ్రోకలీ, బాదాం, జీడిపప్పు, ఖర్జూరం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు, అవిశె గింజలు, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్, సాల్మన్, చికెన్ లాంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇవి తరచుగా తినడం వల్ల మన శరీరంలో మెగ్నీషియం(magnesium) లోపం(deficiency) ఏమైనా ఉంటే తొలగిపోతుంది. తిరిగి మనకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటో ముందు గుర్తించే ప్రయత్నం చేయాలి.