Avoid These Fruits : పండ్లు ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. అయితే పరగడుపున కొన్ని పండ్లను(Fruits) తినడం వల్ల మాత్రం మనపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయిట. ఉదాహరణకు నారింజ, కమలా, బత్తాయి లాంటి సిట్రస్ జాతి పండ్లను పరగడుపున తినడం అస్సలు మంచిది కాదు. వీటిలో ఉండే ఆమ్ల లక్షణాల వల్ల జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఈ ఆమ్ల లక్షణాలు జీర్ణాశయంలోని పై పొరకు ఇబ్బందికరంగా మారతాయి. అందువల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్ణం లాంటి పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
మామిడి, పియర్ జామ కాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని పరగడుపున(Empty stomach) తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తలెత్తుతుంది. వీటిల్లో ఉండే ఈ పీచుల్ని అరిగించేందుకు పొట్ట ప్రయత్నిస్తుంది. ఫలితంగా జీర్ణ కోశం లోపల ఉండే పైపొర దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. యాపిల్, పైనాపిల్లాంటి వాటి లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. పరగడుపున వీటిని తినడం వల్ల పొట్టలో గ్యాస్ రావడం, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. బదులుగా వీటిని ఆహారం తిన్న తర్వాత తీసుకోవడం ఉత్తమం. అలాగే బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రొటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహకరిస్తుంది. ఖాళీ కడుపుతో బొప్పాయిని తినడం వల్ల ఈ ఎంజైమ్‌తో ఇబ్బంది తలెత్తుతుంది. దీని వల్ల జీర్ణాశయంలోని పైపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అరటి పండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా దీనిలో విటమిన్లు, మినరళ్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలోకి మెగ్నీషియం ఎక్కువ మోతాదులో చేరిపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా గుండె సమస్యలూ వస్తాయని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. అలాగే ద్రాక్ష పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే తినడం వల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల కడుపులో గందరగోళంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ పండ్లన్నింటినీ(Fruits) టిఫిన్, భోజనం చేసిన కాసేపటి తర్వాత తినడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.