M.E Azad: డబ్బింగ్ కింగ్ ఎంఈ ఆజాద్.. వాయిస్ బాగుందని చెప్పడంతో విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఇక తర్వాత ఆయన కష్టాలు చూడాలీ. స్నేహితుల గదిలో ఉంటూ.. అవకాశాల కోసం రోజు స్టూడియోల వెంట తిరిగేవారట. ఆయన తండ్రి డీఈవో.. తనని కూడా మంచి పొజిషన్లో చూడాలని అనుకున్నారని.. కానీ తనకు అదీ ఇంట్రెస్ట్ లేదని హిట్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. చిన్నప్పుడు తన వాయిస్ బాగుందని.. తన తండ్రి, అతని స్నేహితులు చెప్పారని పేర్కొన్నారు. రెడియో, టీవీ, డబ్బింగ్ అంటే ఏంటో తనకు తెలియదన్నారు. ఏదో చేయాలనే తపన ఉండేదన్నారు.
చిన్నప్పుడు స్కూల్లో కామెంటరీ చెప్పేవాడినని గుర్తుచేస్తున్నారు. టీచర్స్ కూడా కొనియాడేవారని తెలిపారు. ఇంట్లో చెప్పి.. హైదరాబాద్ వచ్చానని, సిటీలో ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారని ఆజాద్ వివరించారు. సికింద్రాబాద్లో అమృతవాణి అనే క్రిస్టియన్ స్టూడియోలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లానని వివరించారు. యేసు చరితం సీరియల్ కోసం ఆడిషన్స్ జరిగాయని.. అందులో తన నంబర్ 85 అని చెప్పారు. ఉదయం 9.30 గంటలకు వెళితే.. మధ్యాహ్నం 2 గంటలకు తన నంబర్ వచ్చిందని తెలిపారు. అప్పటికీ ఏమీ తినలేదు, మంచినీరు తాగి వెళ్లానని తెలిపారు. కొత్త కాబట్టి ఏమీ తెలియదని.. తడబడ్డానని తర్వాత ధైర్యం చేసి చెప్పానని తెలిపారు. జీసస్ పాత్రకు తన వాయిస్ సూట్ అవుతుందని తీసుకున్నారని వివరించారు. అలా 250 ఎపిసోడ్స్ చేశానని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొంటే రూ.150 ఇచ్చేవారని తెలిపారు.
1991లో రెడియోలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లానని పేర్కొన్నారు. అక్కడ 200 మంది రాగా.. తాను సెలెక్ట్ అయ్యానని తెలిపారు. తర్వాత వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీకి యాడ్ చేశానని.. ముద్ర,ఎవరెస్ట్, రామోజీ ఫిల్మ్ సిటీ వారు కూడా తనను సంప్రదించారని తెలిపారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదని చెప్పారు.