Hyundai: ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) సంస్థ ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ఎస్ యూవీ (SUV)ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ ‘ఎక్స్ టర్’ ను సోమవారం మార్కెట్‌కు పరిచయం చేసింది. స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ (SUV) కారును మధ్య తరగతి కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. స్పోర్ట్స్ కారులో ఉండే అన్ని సదుపాయాలు ఉండేలా.. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ కారుకు ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షలుగా నిర్ణయించింది. ఎక్స్ టర్ మోడల్‌తో హ్యుందాయ్ ఇండియా కంపెనీ పూర్తిస్థాయి ఎస్ యూవీ విభాగంలోకి ప్రవేశించిందని చెప్పడానికి ఎంతో సంతోషించామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఉన్సూ కిమ్ తెలిపారు. ఇక నుంచి హ్యూందాయ్ ఎస్ యూవీ కార్ల కొనుగోలు పుంజుకుంటుందని తెలిపారు.
ఈ మోడల్ తీసుకొని రావడానికి రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టామని చెప్పారు. సౌత్ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీని ఇండియన్స్ ఓన్ చేసుకున్నారని.. ఇక్కడ రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఈ కార్లలో 19.2 కిలోమీటర్ల మైలేజీ వచ్చే హై స్పీడ్ ఆటోమేటిక్ మోడల్ కారు ధర రూ.7.96 లక్షలుగా నిర్ణయించామని ఉన్సూ కిమ్ చెప్పారు. 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే సీఎన్జీ మోడల్ ధర రూ.8.23 లక్షలుగా నిర్ణయించినట్లు వివరించారు. కారులో వాయిస్-ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, సెల్ఫీ తీసుకోవడానికి డ్యాష్ బోర్డ్ కెమెరా, పెద్ద కార్ మోడళ్లలో కనిపించే వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జీంగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.