Delhi Airport : భారత దేశ రాజధాని నగరం దిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన ఘనత దక్కింది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ACI) టాప్ 10 బిజీయెస్ట్ ఎయిర్‌పోర్ట్స్(Top 10 Busiest Airports) జాబితాని 2023 సంవత్సరానికి గాను విడుదల చేసింది.
ఆ జాబితాలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో దిల్లీ ఎయిర్ పోర్టు(Delhi Airport)పదో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ లిస్ట్‌లో అమెరికాలోని అట్లాంటా ఎయిర్ పోర్ట్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. తర్వాత దుబాయ్, డాలస్ పోర్ట్ వర్త్, లండన్.. తదితర విమానాశ్రయాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించిన నివేదిక వివరాల ప్రకారం.. 2023లో దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఏడు కోట్ల 22 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
అయితే 2022 సంవత్సరంలో దిల్లీ ఎయిర్ పోర్టు ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కరోనాకు ముందు 2019లో 17వ స్థానంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ఇంత తక్కువ కాలంలో టాప్ టెన్‌లో స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇక తొలి స్థానంలో నిలిచిన అట్లాంటా ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపుగా 104.6 మిలియన్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి 86.99 మిలియన్ల మంది, మూడో స్థానంలో నిలిచిన డల్లాస్/ పోర్ట్ వర్త్ విమానాశ్రయం నుంచి దాదాపుగా 81.75 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు.