కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం రెండు సంవత్సరాల పాటు ఈ కోవిడ్ భయంతోనే జీవించారు. ఇప్పుడిప్పుడే కాస్త సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కోవిడ్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
తాజాగా తేలిన విషయం ఏమిటంటే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కరోనా నుంచి బయటపడిన ప్రతి పది మందిలో ఒకరు ఇప్పటికీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో 12 కీలక లక్షణాలు ఉన్నట్టు వెల్లడించారు. చిన్నపాటి పనికే అలసిపోవడం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, మెదడు సమస్యలు, శృంగారంపై అనాసక్తి, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, చాతీలో నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి లాంగ్ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తున్నారు.