ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేదికలతో కోట్లాది మంది యూజర్లకు చేరువైంది.
ఇటీవల గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య కృత్రిమ మేధ అంశంలో పోటీ తీవ్రతరమైంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించిన కొన్నిరోజులకే గూగుల్ కూడా తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ తమ సిబ్బందికి ఓ మెమో జారీ చేశారు. సంస్థ ఉత్పాదనలు, వ్యక్తులు, ప్రాధాన్యతలు, ఉద్యోగాల తొలగింపునకు దారితీస్తున్న పరిస్థితులపై సంస్థ సమీక్ష సమావేశం నిర్వహించిందని వెల్లడించారు.