»Revanth Reddy Congress Will Be In Power In Telangana By Then
Revanth Reddy: కొత్త స్థూపంలో అమరుల పేర్లు రాయలే..నిర్మాణంలో కోట్ల అవినీతి
రెండు సార్లు ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. వచ్చిన తర్వాత వాళ్ల లెక్కలు లేవంటున్నారని విమర్శించారు.
Revanth Reddy: రెండు సార్లు ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. వచ్చిన తర్వాత వాళ్ల లెక్కలు లేవంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,563 మంది అమరుల పేర్లను సువర్ణాక్షరలతో లిఖిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. చరిత్ర అంటే గెలిచిన వాడిది కాదు.. త్యాగం చేసిన వాడిదన్నారు. కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాలను పావుగా వాడుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను నమ్మి ఈ సారి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో రేవంత్రెడ్డి మాట్లాడారు. అమరుల చిహ్నం పేరుతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రశ్నించే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి అన్నారు. 2023, డిసెంబర్ 9లోగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడుతుందన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి యూపీఏ ప్రభుత్వం ఓ ప్రకటన చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాల వల్లే ఇప్పుడు కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణ అమరవీరులు 1,200 మంది అని ప్రభుత్వం చెప్పలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి శాసనసభ స్పీచ్ లో సీఎం కేసీఆర్ ఈ విషయం చెప్పలేదా? అని రేవంత్ నిలదీశారు. శాసనసభలో అమరవీరులపై ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను అవమానించేలా బీఆర్ఎస్ పని తీరు ఉందన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం పనులను పర్యవేక్షించడానికి 6 శాతం డబ్బులు చెల్లించారని చెప్పారు. ఆ స్థూప నిర్మాణానికి రూ.63,75,35,381తో టెండర్లు పిలిచారన్నారు. ఆ తర్వాత అంచనా వ్యయం పెంచుకుంటూపోయారని, చివరకు రూ.179.5కోట్లకు పెంచారని తెలిపారు. నూతన అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లను రాయలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అమరవీరుల స్థూపాన్ని కట్టడానికి తొమ్మిదేళ్లు పట్టిందని విమర్శించారు. అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లు ఉండాలని డిమాండ్ చేశారు.