ఢిల్లీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పిడిగుద్దులు, పంచుల మధ్య కొనసాగింది. కమిటీ సభ్యుల ఎంపిక కోసం ఓటింగ్ జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో తాము గెలిచామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. బిజెపి మాత్రం దీనిని అంగీకరించడం లేదు. దీంతో సభలో రసాభాస చోటు చేసుకున్నది. MCD హౌస్ లో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం ఓటింగ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని, తమ పార్టీ గెలిచిందని సౌరబ్ భరద్వాజ ప్రకటించారు. బిజెపి కౌన్సిలర్లు కొంతమంది క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని, కమలం పార్టీకి చెందిన అయిదుగురు సభ్యులు, తమ పార్టీకి ఓట్లు వేశారని ఆయన తెలిపారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు ఒకరు భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఆ బలం 133కి తగ్గిందని, ఇకానీ అయిదుగురు బిజెపి సభ్యులు తమకు ఓటు వేయడంతో 138 ఓట్లతో తాము విజయం సాధించామని ప్రకటించారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో తామే గెలిచామని స్ ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ తప్పుడు ప్రకటన చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడాన్ని, బిజెపి తప్పు పట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితం చెల్లని ఓటు లేకుండానే ప్రకటించబడుతుందని మేయర్ పట్టుబట్టడంతో… బిజెపి – ఆమె ఆద్మీ పార్టీ మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. ఇరు వర్గాలు పరస్పర దాడికి దిగాయి. కొట్టుకొని.. తన్నుకొనే స్థాయికి వెళ్ళాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి.
MCD హౌస్ లో జరిగిన బాహాబాహీ నేపథ్యంలో… తమ పైన బీజేపీ కౌన్సిలర్లు దాడి చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. హౌస్ లోని గందరగోళం, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులపై దాడికి సంబంధించి బిజెపి కౌన్సిలర్ల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు మేయర్. పరస్పర దాడి జరిగనప్పటికీ మేయర్ తీరు ఒక పార్టీకి అనుకూలంగా ఉంది. మేయర్ నేడు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను కలవనున్నారు. బిజెపి సభ్యులు తమపై దాడి చేసిన ఘటనను ప్రజాస్వామ్యం యొక్క చీకటి రోజుగా అభివర్ణించారు మేయర్. తనను MCD హౌస్ నుంచి బయటకు తీసుకు వెళుతుండగా బిజెపి కౌన్సిలర్ అర్జున్ మార్వా… తమపై దాడికి పాల్పడ్డారని మేయర్ ఆరోపించడం గమనార్హం.