»Political War In Ap Former Cbi Jd Lakshminarayana Announced A New Party
Lakshminarayana: ఏపీలో పొలిటికల్ వార్.. కొత్త పార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. అలాగే నేడు 'తెలుగు సేన పార్టీ' అనే పేరుతో ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి కూడా కొత్త పార్టీని స్థాపించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీలో బరిలోకి దిగనున్నాయి. ఈ తరుణంలో ఏపీలో మరో కొత్త పార్టీ వెలసింది. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పార్టీ పేరుతో పాటుగా పార్టీ జెండాను సైతం ఆయన విడుదల చేశారు. జాతీయ జెండా రంగులతో లక్ష్మీ నారాయణ ఉన్న ఫోటోతో కూడిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
Ex IPS officer @VVL_Official VV Lakshminarayana popularly known as JD Lakshminarayana in Telugu states had announced launching of a new political party – Jai Bharat National party.
A Maharashtra cadre IPS officer, Lakshminarayana during his tenure on deputation to CBI had… pic.twitter.com/zl5I20FzIF
అంతకుముందు ప్రముఖ సినీ నిర్మాణ సత్యారెడ్డి కూడా ఏపీలో కొత్త పార్టీని ప్రకటించారు. తెలుగు సేన పార్టీఅనే పేరుతో సత్యారెడ్డి కొత్త పార్టీని స్థాపించగా కొన్ని గంటల్లోనే లక్ష్మీనారాయణ కూడా కొత్త పార్టీని ప్రకటించడంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరికాస్త ఎక్కువైంది. నేడు విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన కొత్త పార్టీని ప్రకటించారు. గత ఏడాదే ఆ పార్టీ పేరును లక్ష్మీనారాయణ ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది.
తొలుత ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని పలు వేదికలపై బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఆయన జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనే సొంతంగా పార్టీ పెట్టడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..ఏపీలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా లేకపోవడమేనని, ఆ ప్రత్యేక హోదాను ఏపీకి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు.
కొత్త పార్టీ ప్రకటన తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని, అప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకొంటూ రాజకీయ ప్రవేశం చేశానన్నారు. అంబేద్కర్ స్పూర్తితో 2019లో ఎన్నికల్లో పోటీ చేశానని, 3 లక్షల మంది ఓటర్లు తనకు ఓటు వేసినట్లు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి పార్టీని స్థాపించినట్లు తెలిపారు. తాను పెట్టిన పార్టీ కాదని, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడమే ధ్యేయం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని నేటి రాజకీయ పార్టీలు ప్రజలను దోపిడీ చేశాయన్నారు. ప్రజలకు సేవ చేయడమే మర్చిపోయారన్నారు. డాలర్ కి సమానంగా రూపాయి ఉండేదని, నేడు ఆ పరిస్థితి దారుణంగా పడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. వైజాగ్ లో జాబ్ మేళా పెడితే 70 శాతం నిరుద్యోగులు వచ్చారని, అందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసినవారేనని అన్నారు.
కుటుంబాలకే రాజకీయాలు పరిమితం కాదు
రాజకీయాలు కొన్ని కుటుంబాలకు పరిమితం అయ్యాయని లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో రాజకీయాలు కుటుంబ రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు, జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. అప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే.. తప్పు చేసిన వాళ్ళు మరొకరని, తప్పు చేసిన వాళ్లకు మద్దత్తు ఇచ్చే వారు ఇంకొకరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కంటే ముందుకు తీసుకొని వెళతామని అన్నారు.