రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం నుంచే భక్తులు క్యూకట్టారు. అయితే వారు టోకెన్లు లేకుండా వస్తుండడంతో, టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించలేదు. క్యూలైన్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భక్తులను టీటీడీ సిబ్బంది అడ్డుకోగా వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారినే క్యూలైన్లలోకి పంపిస్తామని అధికారులు తేల్చిచెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు టోకెన్లు ఉన్నవారిని భక్తులు క్యూలైన్లలోకి అనుమతించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం భక్తులు నారాయణగిరి గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వాస్తవానికి టీటీడీ డిసెంబరు 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకు మాత్రమే సర్వదర్శన టోకెన్లు తప్పనిసరి అని చెప్పింది. ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ రోజు దర్శనానికి టోకెన్లు తప్పనిసరి అని ప్రకటించకపోవడంతో భక్తులు అంచనాలకు మించి తరలివచ్చారు. అధికారులు టోకెన్లు ఉంటేనే భక్తులను అనుమతిస్తున్నారు. కాగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను గత రాత్రి నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల ద్వారా భక్తులకు అందిస్తూ వస్తున్నారు.