»New Type Of Corona Cases Are Increasing Again In India
Corona: భారత్‌లో మళ్లీ పెరుగుతోన్న కొత్త రకం కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఈజీ 5.1 రకం వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
భారత్(India)లో మళ్లీ కరోనా(Corona) పేరు వినిపిస్తోంది. కరోనా వైరస్ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి మహారాష్ట్ర (Maharastra)లో కరోనా కేసులు పెరగడం ప్రారంభమైంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 1, 2వ విడతల్లో కరోనా కేసులు, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
ఒమిక్రాన్(Omicran) ఈజీ.5.1 రకం వైరస్ కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో ఇటువంటి వేరియంట్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. మే నెలలోనే ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ కార్యకర్తే వెల్లడించారు. బీజే మెడికల్ కళాశాలలో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన ఆ వేరియంట్‌ను మే నెలలో గుర్తించినట్లు తెలిపారు.
అయితే ఈ వేరియంట్ ఎక్స్ బీబీ.1.16, ఎక్స్ బీబీ.2.3 వేరియంట్ల మాదిరిగా ప్రభావం చూపదన్నారు. అయినా కానీ మహారాష్ట్ర (Maharastra)లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారంగా జులై చివరికి 70 కేసులున్నాయని ఆ తర్వాత ఆగస్టు 6వ తేదికి 115 కేసులు పెరిగినట్లు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా ముంబైలో 43 కేసులు, పూణెలో 34 కేసులు, థానేలో 25 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు.