ప్రస్తుతం ఎల్బీనగర్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్న మెట్రో సదుపాయాన్ని.. హయత్ నగర్ వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నాగోల్-ఎల్బీనగర్ లైన్ను అనుసంధానం చేస్తామని, వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేస్తామని ప్రకటించారు.
మంగళవారం ఎల్బీనగర్ పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్-ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని సెకండ్ ఫేజ్లో అనుసంధానం చేస్తామని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని, నగరంలో ప్రజారవాణాను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రేపే పనులు చేస్తామని తాము చెప్పడం లేదని, ముందుగానే టైమ్ చెప్పి పనులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.55 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్నే అని, ఆ విషయం అందరికీ తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టిమ్స్ ఆస్పత్రి త్వరలో గడ్డి అన్నారంలో రాబోతుందన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిలను నిర్మిస్తామని, హైదరాబాద్లో రూ.985 కోట్ల నిధులతో నాలాల పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. ఆటోనగర్లో ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.