దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు నమోదవుతుండటంతో వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
తగ్గిపోయాయని అనుకున్న కరోనా కేసులు (Corona Casess) మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా కరోనా కొత్తవేరియంట్ (New Variant) అందరిలోనూ అలజడి రేపుతోంది. ఈ తరుణంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మొదట పాజిటివ్ వచ్చిన ఓ మహిళ ఎంజీఎం (MGM) ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో చేరి చికిత్స పొందుతోంది.
ఆ మహిళతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ (Home Isolation)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘనపురం మండలం గాంధీనగర్‌కు చెందిన ఆగమ్మ అనే 60 ఏళ్ల మహిళకు నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. పాజిటివ్ రావడంతో ఆమెను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
వైద్య సిబ్బంది ఆ మహిళ కుటుంబీకుల నుంచి శాంపిళ్లను సేకరించారు. దీంతో కుటుంబంలోని మరో నలుగురికి కూడా పాజిటివ్ తేలింది. వారిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఊరి జనం భయాందోళన చెందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.