»Complaint Against Brs Mla Chinnaiah To Womens Commission At Delhi
BRS MLA:పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై ఓ మహిళ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఈ అంశంపై పోలీసులకు అనేకసార్లు తెలిపినా కూడా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే వేధింపులతోపాటు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న మహిళ కంప్లైంట్ చేసింది. ఓ వీడియో స్టేట్మెంట్లో భాగంగా ఆమె ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, తెలంగాణ పోలీసులు తమ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించామని తెలిపారు. ఎమ్మెల్యే తన మద్దతుదారుల ద్వారా బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం చేస్తున్నాడని వాపోయింది. అయితే ఈ ఎమ్మెల్యేపై తొలిసారిగా మార్చిలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సహకరించినందుకు ప్రతిఫలంగా తన వద్దకు మహిళలను పంపాలని ఎమ్మెల్యే కోరినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు భూకేటాయింపులో తమకు సాయం చేయలేదని, లంచం తీసుకుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రైవేట్ డెయిరీ యాజమాన్యం ఆరోపించింది. సోషల్ మీడియాలో ప్రసారమైన ఆడియో క్లిప్‌లో డెయిరీ భాగస్వామి ఎమ్మెల్యే రెండు ఎకరాల భూమిని ఇచ్చారని, దాని కోసం వారు తనకు రూ. 20 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఓ బాలికతో కలిసి అతడిని పరామర్శించిన అనంతరం ఆమెకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని తన వద్దకు పంపాలని కోరాడు. అది సాధ్యం కాదని ఆమె చెప్పడంతో ఇతర అమ్మాయిలను తన వద్దకు పంపాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు.
ఆ తర్వాత బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిరసన తెలుపగా.. తమను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు తమను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని ఆమె చెప్పారు. మరోవైపు ఈ అంశంపై తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. డెయిరీ పేరుతో రైతులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని, అందుకే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చిన్నయ్య తెలిపారు.