KCR: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) నిప్పులు చెరిగారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందని కేసీఆర్ అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని చెప్పారు. ఆర్థికపర పరిమితులు విధిస్తోందని ఆరోపించారు. దాడులకు పాల్పడుతోందని.. కేంద్ర ప్రభుత్వ చర్యలను దేశం గమనిస్తోందని వివరించారు. కర్ణాటకలో బీజేపీకి ప్రజలు వాత పెట్టిన ఆ పార్టీ తీరు మారలేదని కేసీఆర్ అన్నారు.
ఇటీవల ఢిల్లీలో రెండు వింత ఘటనలు జరిగాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఆప్ పాపులర్ పార్టీ. కేజ్రీవాల్ నాయకత్వంలో సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ మూడు సార్లు అద్భుతమైన విజయం సాధించింది. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో ఆప్ విజయం సాధించింది. బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. మేయర్‌ను ప్రమాణస్వీకారం చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ప్రమాణం చేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ మూడుసార్లు కూడా రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తీసుకొచ్చి ఊపిరాడకుండా చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేజ్రీవాల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులందరూ పని చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే. గవర్నర్ల చేతుల్లో ఉండరాదని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కూడా మోడీ ప్రభుత్వం కాలరాసింది. దానికి సంబంధించి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు.. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.