మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల కిందట మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో ఆరోజు తాను రాలేననని చెప్పారు.
‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా?’ అని మంగళవారం అవినాశ్ వ్యాఖ్యానించారు. విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని అవినాష్‌రెడ్డి కోరారు. ఆయన కోరిక మేరకు సీబీఐ విచారణ తేదీని మూడో రోజుల ముందే తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 28న విచారణకు రావాల్సిందిగా రెండోసారి నోటీసులు పంపింది. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అవినాశ్ ను ప్రశ్నించలేదు. కడప నుంచి కేసు హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్‌కు నోటీసులిచ్చింది. విచారణ వివేకా హత్యలో అవినాశ్ పై వస్తున్న ఆరోపణలపై ఆరా తీయనుంది. అయితే అవినాశ్ కు నోటీసులు అందడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దడ మొదలైంది. సీబీఐ దూకుడు స్వభావంతో ముందుకు వెళ్తే అవినాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కొందరి ఆదేశాలతో సీబీఐ విచారణ పైపైనే విచారణ చేస్తుందని సమాచారం.