తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటి నుంచే రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ లో ఎవరినీ చూసి ఓట్లేయాలని ప్రశ్నించారు. మూడో స్థానానికి ఆ పార్టీ పరిమితమవుతుందని, భవిష్యత్ లో నాలుగో స్థానానికి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఇంతలా దిగజారడానికి కారణం కాంగ్రెస్ నేతలే అని తెలిపారు. నాగర్ కర్నూల్ లో కులచిచ్చు రేపేందుకు ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’ పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ పెట్టిందని ఆరోపించారు. ముందు కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఈసారి కూడా తనపై నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేయాలని, నాగం ఎమ్మెల్యేగా గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని శపథం చేశారు.
ఈ విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, లేదా ఇతర కుటుంబసభ్యులను ఎవరినైనా నాగర్ కర్నూల్ అసెంబ్లీ బరిలో నిలిపే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’ నాగర్ కర్నూల్ లో నిర్వహించింది. దీని ద్వారా నాగం జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో తన బలమేంటో చాటి చెప్పారు.