ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తమ పార్టీని,నేతలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీలోని నేతలు ఎవరూ చేజారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీ నారాయణను చేజారనివ్వకుండా పార్టీ అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపడుతోంది.
బీజేపీ అంతర్గత వ్యవహారాలపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna lakshmi narayana) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ఎదుట అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం ముందుకు వచ్చింది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందుకు తీసుకురావొద్దని సూచించింది.
ఏమైనా ఉంటే పార్టీలో చర్చించాలని సూచించింది. కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నా తన అనుచరులను పిలిపించుకొని మంతనాలు జరుపుతున్నారు. పార్టీ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో కొనసాగుతారా లేదంటే పార్టీని వీడతారా అనే దానిపై ఉత్కంఠత నెలకొన్నది. పార్టీ వీడే ఆలోచన లేదని కన్నా అనుచరులు చెబుతున్నారు. మరి కన్నా మదిలో ఏమున్నదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.