ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మద్యం (Liquor) ధరలు పెరిగాయి. అంతేకాదు పెరిగిన ధరలు ఇవాళ్టి (శనివారం) నుంచే అమల్లోకి కూడా వచ్చేశాయి. క్వార్టర్‌పై 10 రూపాయలు... ఫుల్‌బాటిల్‌పై 20 రూపాయలు పెంచేసింది ఏపీ ప్రభుత్వం. ఇక.. ఫారిన్ లిక్కర్‌పై అయితే ఏకంగా 20శాతం వరకు ధరలు పెంచేశారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నిజంగా షాకే అంటున్నారు మందుబాబులు.
ఏపీలో మందుబాబులకు షాక్ తగిలింది. మరోసారి మద్యం ధరల(Alcohol prices)ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్టర్ పై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రూపాయల్లో విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను శాతాల్లోకి మారుస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలో తగ్గుదల కనిపించింది. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ఎక్సైజ్ శాఖ.
ఏఆర్ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవు. కనుక.. అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్ఈటీని శాతాల్లోకి మార్చింది ఎక్సైజ్ శాఖ. దీని వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పన్నుల భారం ఒకేలా పడనుంది. అంతేకాదు.. కొన్ని మద్యం బ్రాండ్లపై ధరలు కూడా తగ్గాయి. ఐఎంఎఫ్ఎల్ (IMFL) కనీస ధర 2వేల 500 రూపాయల లోపు ఉంటే దానిపై 250 శాతం పెరిగింది. 2వేల 500 రూపాయలు దాటితే 150 శాతం పెరిగింది. ఇక బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం ధరలు పెరిగాయి. ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్ఈటీ పెరిగింది. దీనికి బట్టి..ఒక ఫుల్ బాటిల్ ప్రస్తుతం 570 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 590 రూపాయలు అయ్యింది. అంటే 20 రూపాయలు పెరిగింది.
మరో బ్రాండ్ క్వార్టర్ 200 రూపాయల నుంచి 210 రూపాయలకు పెరిగింది. కొన్ని బ్రాండ్లలో క్వార్టర్ బాటిల్ (Quarter bottle)పై 10 నుంచి 40 రూపాయల వరకు, హాఫ్ బాటిల్‌పై 10 నుంచి 50 రూపాయల వరకు, ఫుల్ బాటిల్‌పై 10 నుంచి 90 రూపాయల వరకు ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.ఫారిన్ లిక్కర్‌పై చాలాకాలంగా ధరలు పెరగలేదు. పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు.. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ(Rajat Bhargava). సరఫరాదారులకు ఇచ్చే ధరను 20శాతం పెంచారు. విదేశీ మద్యం బ్రాండ్ల కొనుగోలు ధరలు పెంచటం వల్ల ఆయా బ్రాండ్ల ఎమ్మార్పీ పెరిగింది.ఏదిఏమైనా… ఇప్పటికే ఏపీలో చాలాసార్లు మద్యం ధరలు పెంచారు. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో మద్యం వినియోగదారులు లబోదిబో అంటున్నారు. ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.