ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ(House Rent Allowance)ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్సులను పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ అలవెన్సులను కూడా 12 నుంచి 16 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాకుండా కేవలం కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అలవెన్సును పెంచుతున్నట్లు ప్రకటించింది. సర్కార్ పెంచిన హెచ్ఆర్ఏ(HRA) ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, పాడేరు, తూర్పుగోదావరి జిల్లా లోని అమలాపురం, అదేవిధంగా బాపట్ల, భీమవరం, నరసరావు పేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తించనున్నట్లు తెలిపింది.
హౌస్ రెంట్ అలవెన్స్(HRA) అనేది ఉద్యోగులకు యజమాని లేదా ప్రభుత్వం చెల్లించాల్సిన జీతం. హెచ్ఆర్ఏకు పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. బేసిక్ పేలో కాకుండా దీనిని వేరుగా ప్రభుత్వం లేదా యాజమాన్య సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం రెగ్యులేషన్ నంబర్ 2A కింద జీతం తీసుకునే ఉద్యోగి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13A) ప్రకారం హెచ్ఆర్ఏ మినహాయింపునకు అర్హులు. శాలరీ స్ట్రక్చర్ లో ఇది కీలకమైన అంశం కావడంతో ఉద్యోగులు(Employees) హర్షం వ్యక్తం చేస్తున్నారు.